పోలేపల్లి పోలేపల్లి ప్రత్యేక ఆర్థికమండలి (సెజ్) కోసం భూమిని ధారపోసిన అభాగ్యులు అడుగడుగునా వంచనకు గురవుతున్నారు. వారికిచ్చిన హామీలు ఆచరణకు ఆమడదూరంలో ఉండిపోతున్నాయి. సెజ్ కారణంగా నిర్వాసితులయ్యే వారికి 200 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఘనంగా హామీ ఇచ్చింది. అది నేటికీ ఆచరణకు నోచుకోలేదు. ఇళ్లకోసం స్థలం కేటాయించినట్లు సూచిస్తూ బోర్డు మాత్రం ఆర్భాటంగా పాతారు. అంతకుమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఉపాధి కల్పనకు ఇచ్చిన హామీ కూడా ఎండమావిగా మారుతోంది.మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి వద్ద 969 ఎకరాలను 2003లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) సేకరించింది.
ఈ మేరకు కేసును లోక్‌అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడానికి గత ఏడాది అక్టోబరు 11న కేసు ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా… మిగిలిన రెండు హామీల విషయంలో మాత్రం చుక్కెదురైంది. మందుల పరిశ్రమ కంపెనీలు నిర్మాణం ప్రారంభించే సమయానికి నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయని, జనవరి ఆఖరునాటికి ఇళ్లలో చేరవచ్చని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు నిర్మాణమే మొదలు కాలేదు. నిర్వాసితుల ఇంటి నిర్మాణాలకు కేటాయించిన స్థలం కూడా ఔషధ కంపెనీలను ఆనుకొనే ఉంది. ఈ కంపెనీలనుంచి వెలువడే కాలుష్యానికి అక్కడ నివాసం ఉండగలరా అన్నది ప్రశ్న.
ఇక నిర్వాసితులకు ఉపాధి అంశం కూడా కాగితాలకే పరిమితమయ్యేలా ఉంది. నిర్వాసితుల్లో ఎక్కువమంది దళితులు, గిరిజనులే. ఈ కుటుంబాల్లో చదువుకున్నవారు చాలా తక్కువ. ప్రస్తుతం వీరికి లభిస్తున్న ఉపాధి తమ భూముల్లో చేపట్టిన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేయడమే. నిర్మాణ పనులు ఎవరి భూముల్లో జరుగుతుంటే వారికి మాత్రమే కూలి పని ఇస్తామని మొదట కంపెనీల ప్రతినిధులు మెలిక పెట్టారు. నిర్వాసితులు నిలదీయడం, అధికారులు జోక్యంతో అందరికీ కూలి పనులు ఇచ్చేందుకు అంగీకరించారు. కార్డులు ఇచ్చి వారిని పనిలోకి తీసుకుంటున్నారు. అయితే ఈ పనులు చేయలేక తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. తనకున్న ఐదెకరాల భూమి తీసుకొన్నారు, కూలి పని చేస్తుండగా కాలు దెబ్బతగిలింది, అయినా పని చేయక తప్పడం లేదని బచ్చన్న నిర్వాసితుడు వాపోయారు. ఇనుప కమ్మీలు మోయడం లాంటి పనులు చేయలేకపోతున్నామని ఓ మహిళ వాపోతే, మీ చేత కాదు వెళ్లిపోండని చెప్తున్నారని గంగమ్మ అనే మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.